తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ దేశంలోనే అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఒరవడిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆధునిక స్మశాన వాటిక రూపొందించింది. ఈ మహాప్రస్థానంను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సందర్శించారు.
ఈ సందర్భంగా సుశీల్ కుమార్ మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఈ మాడ్రన్ స్మశాన వాటికను ఎంతో బాగా ఏర్పాటు చేశారని, విశాలమైన ప్రాంతంలో చాల చక్కటి వాతావరణంను కల్పించారన్నారు. “మహా ప్రస్థానం మోడల్ చాల బాగుంది.. ఇక్కడి విధానాలనే బీహార్ లో కూడా అవలంభిస్తాం. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఎంతో బాధతో స్మశాన వాటికలకు వస్తారు. అలాంటి వారికోసం ఇక్కడ త్రాగునీరు, స్నానపు గదులు, ప్రశాంత వాతావరణం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మహా ప్రస్థానం స్మశాన వాటిక చాల బాగుంది..మా రాష్ట్రంలో కూడా ఆధునిక స్మశాన వాటికలను నిర్మించాలనుకుంటున్నాం..ఇక్కడి విధానాలు క్షుణ్ణంగా పరిశీలించాం.ఆధునిక స్మశాన వాటికలను నిర్మించేందుకు మహాప్రస్థానం నిర్మాణం ఎంతో అనుసరణీయం“ అని తెలిపారు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక స్మశాన వాటిక మహా ప్రస్థానం నిర్మాణం పట్ల బీహార్ డిప్యూటీ సీఎం సుశీలకుమార్ మోడీ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించి బీహార్ రాష్ట్రంలో ఇలాంటి స్మశాన వాటికలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారని వివరించారు.