ఏపీ పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది.. తాజాగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను చూసేందుకు ఇద్దరు పిల్లలతో సహా వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వేడుకలకు వచ్చే ఓ మార్గాన్ని పోలీసులు మూసివేసారు. అటువైపు వచ్చే జనాన్ని పోలీసులు అదుపు చేసే క్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని ఫుట్‌పాత్‌పై నిలుచుని వేరే మార్గంలో వెళ్లడం ఎలాగో ఆలోచిస్తున్నారు. దీంతో అక్కడి పోలీసులు అతడిని చుట్టుముట్టి చితకబాదారు. అసలిక్కడ ఎందుకున్నావ్.. ఎక్కడికెళ్లాలి అనేవి ఏమీ అడగకుండా దాడి చేసారు. అయితే తమతండ్రిని కొడుతుండటంతో దిక్కుతోచని చిన్నారులు ఏడుస్తూ “మానాన్నను కొట్టకండి” అంటూ పోలీసులను దీనంగా ప్రాధేయపడ్డారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్నవారి కళ్లు చెమ్మగిల్లాయి. చివరికి ఆ తండ్రి పిల్లలను ఓదార్చుతూ, పోలీసుల దెబ్బలను తడుముకుంటూ ఇంటిముఖం పట్టాడు. అయితే సీఎం పర్యటనల్లో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సభలు సమావేశాలకు భద్రతనివ్వాలి.. తప్పులేదు.. కానీ ట్రాఫిక్ పేరుతో, ప్రోటోకాల్ పేరుతో ప్రజలను హింసించకూడదు. ఇవి చూస్తున్న ప్రజలు సామాన్యుడి పై జులుం దారుణమని, ఇదే పోలీసుల నైజం అంటూ విమర్శిస్తున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు ప్రక్కన ఉన్నప్పుడు తండ్రిని అంత దారుణంగా కొట్టడం, ఏడుస్తున్న ఆ పిల్లలును చూసి కుడా పోలీసులు దయచూపకపోవటానికి అర్ధం వారిలో మానవత్వం లేకపోవడమేనంటున్నారు. ఇలా అయితే రాను రాను సమాజంలో పోలీసులపై ఉన్న కాస్త గౌరవం కూడా పోతుందంటున్నారు నెటిజన్లు. ఇదేనా మనకు వచ్చిన స్వాతంత్ర్యం అంటూ గౌరవిస్తున్నారు.
