మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని, ఐ మిస్ యూ అటల్ జీ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందని తన సంతాప ప్రకటనలో తెలిపారు. అటల్ జీ మరణంతో నా నోట మాట రావడం లేదు. 65 ఏళ్ల స్నేహం మాది. ఆరెస్సెస్‌లో ప్రచారకర్తలుగా ప్రారంభమైన మా అనుబంధం భారీతీయ జన్ సంఘ్లోనూ కొనసాగింది. అపారమైన దేశ భక్తి, అన్నింటికి మించి మానవతా విలువలు ఉన్న గొప్ప వ్యక్తి. సైద్ధాంతిక విభేదాలున్నా ప్రతి ఒక్కరిని హృదయాన్ని గెలిచిన వ్యక్తిత్వం వాజ్‌పేయికి సొంతం. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు కలిసే ప్రయాణించాం. ఎమర్జెన్సీ చీకటి రోజులను కలిసే ఎదుర్కొన్నాం అంటూ అటల్ జీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.
