రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? తన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ విషయంలో ఆయన వైఖరి రాజకీయవర్గాలు ఆమోదించే విధంగా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై నిర్భయ కేసు నమోదు చేయడం, అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించడం తెలిసిన సంగతే. బెయిల్ దొరకకపోవడంతో ఆయన్ను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే, లైంగిక వేధింపుల కేసులో తన తనయుడు సంజయ్ అరెస్టును సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. సంజయ్ అరెస్టు విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని, సీఆర్పీసీ 41-ఏ నిబంధన ప్రకారం నోటీసులు జారీచేసి సంజాయిషీ తీసుకోకుండానే అరెస్టుచేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణను ఉమ్మడి హైకోర్టు ఈ నెల 21న చేపట్టనుంది.
అయితే డీఎస్ తీరును పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మేయర్ హోదాలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి తీవ్ర అమానవీయ ఘటనలకు పాల్పడితే వాటిని సీనియర్ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఖండించాల్సింది పోయి… ఇన్నాళ్లు స్పందించకపోవడం విస్మయకరం అంటే…అరెస్టును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడం ఏమిటని పలువురు పేర్కొంటున్నారు.