ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది బహిరంగ వాస్తవమే.. ఈ క్రమంలో బలరాం కొడుకు వెంకటేష్‌కి కూడా టికెట్ ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందట. దీంతో బలరాంకు 2019లో టీడీపీలో సీటు ఇచ్చే అవకాశం లేకపోవడం, గోట్టిపాటిదే సీటు అని ఆయన వర్గం ప్రచారం చేసుకోవడంతో బలరాం వైసీపీలోకి వస్తారని ఏడాది క్రితమే ఫిక్స్ అయిపోయింది.
అలాగే కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి పై బలరాం కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసారు.. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యే చంద్రబాబు పై విమర్శలు చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. బలరాం పార్టీ స్థాపననుండే టీడీపీలో ఉన్నారని, అలాంటి పార్టీలో బలరాం కు గౌరవం తగ్గిందనే వాదనా ఉంది. గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య పోరు ముదిరి పాకాన పడినా ఈ వివాదాన్ని పరిష్కరించి రెండు కత్తులను ఒకే ఒరలో ఇమడ్చేందుకు సీఎం చంద్రబాబు కనీసం గట్టి ప్రయత్నాలు చేయకపోవడం కరణం వర్గాన్ని బాధిస్తోందట.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ కోసం ఇరు వర్గాలు పట్టుబడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
గొట్టిపాటి టీడీపీలో చేరిన దగ్గర బలరాం బాగానే ఉంటున్నా ద్వితియ శ్రేణి న్యాయకత్వానికి ఇబ్బందులు కలుగుతున్నాయట.. తామంతా కరణం ఓకే అంటే వైసీపీలోకి వెళ్లిపోవాలని భావిస్తున్నారట. అంతేగాక వైసీపీ పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉంటున్నారట. మరోవైపు వైసీపీ కూడా కరణం వంటి బలమైన వ్యక్తి తమ పార్టీలోకి వస్తే జిల్లా వ్యాప్తంగా పార్టీకి ఊపు వస్తుందని, అలాగే ఆయన కొడుకు వెంకటేష్ భవిష్యత్తు కూడా బావుంటుందని చెప్తున్నారట. అయితే బలరాం వర్గం పార్టీకోసం ఎట్టిపరిస్థితుల్లో రవికి సపోర్ట్ చేయదు. దీంతో బలరాం టీడీపీ తరపున అద్దంకిలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడంతో తన వారసుడికి సీటు రాదని తేలిపోవడంతో కరణంకు అగ్నికి ఆజ్యం తోడయినట్లు.
దీంతో వైసీపీలోకి మారతారని స్పష్టమైన సంకేతాలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆయనకు అద్దంకి వెంకటేష్ కు జిల్లాలోని మరో నియోజకవర్గం లేదా జిల్లా స్థాయి పదవితో మళ్లీ దూసుకెళ్లాలని కరణం వర్గం భావిస్తోంది. అయితే ఇటీవల జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో బలరాం కలిసిన ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడతో బలరాం చేరిక వార్తలకు బలం చేకూరుతోంది.