వైఎస్ఆర్ జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం ఈడిగపల్లి గ్రామంలోని రేషన్ షాపు ఇది. ఇక్కడ బియ్యం, పంచదారతోపాటు మద్యాన్ని కూడా అమ్ముతున్నారు. రేషన్ షాపు సరుకులతోపాటు.. అడుగడుగునా.. మద్యం అమ్మకాలు జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతుండటంతో అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. సివిల్ సప్లై శాఖ కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది.
ఇష్టారీతిన బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుండటం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. బెల్టుషాపులు అధికమవడం వలనే.. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు.
జిల్లాలోని 50 మండలాల పరిధిలో పరిస్థితి ఇలానే ఉంది. బెల్టుషాపులను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు మామూళ్లమత్తులో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఎన్ని బెల్టుషాపులు పెడితే అన్ని ఎక్కువగా మామూళ్లు వస్తాయంటూ ఉన్నతాధికారులు కూడా కిమ్మనడం లేదు. దీంతో జిల్లాలో బెల్టుషాపుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెదపసుపుల గ్రామంలో మహిళలందరూ ఉద్యమం చేసి బెల్టుషాపులతో సహా మద్యం దుకాణాలను మూసి వేయించారు. అయితే, అన్ని చోట్లా మహిళల్లో ఆ స్థాయిలో చైతన్యం లేకపోవడంతో అధికార పార్టీ నేతలది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. దశల వారీగా మద్యం అమ్మకాలను నిషేధిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దశల వారీగా బెల్టుషాపులను పెంచుకుంటూ పోతున్నారని మహిళలు మండిపడుతున్నారు.
కమలాపురం, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు ఇలా ఎక్కడ చూసినా.. ప్రతీ వంద కిలోమీటర్లకు ఒక బెల్టుషాపు దర్శనమిస్తోంది. ఇటీవల తన గ్రామంలో సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గం బెల్టుషాపు పెట్టారంటూ బద్వేలు ఎమ్మెల్యే జయరాములు నానా రచ్చ చేశారు. తన నియోజవర్గంలో అత్యధికంగా ఉన్న బెల్టుషాపులను ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.