భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజకీయాల్లో వాజపేయి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆధునిక భారత రాజకీయాల్లో వాజపేయి ఇటు ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఒక ఆదర్శనీయమైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయనాయకులు వాజపేయి జీవితాన్ని, ఆయన పోషించిన పాత్రను, రాజకీయాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. నైతిక విలువలతో నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలను వాజపేయి చేశారని, రాజకీయాలను ప్రజాసేవ భావించిన దేశాన్ని ప్రేమించిన గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. వాజపేయి నిరాడంబరమైన జీవితాన్ని గడిపారని, ప్రధాని పదవిని సైతం నిర్వహించినా ఎక్కడా ఆయన గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించే లేదని, సాదాసీదా జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు. అధికార పార్టీని ప్రతిపక్షాలను ఆయన ఏనాడు చిన్నచూపు చూడలేదని, దేశ ప్రయోజనాలు, దేశాభివృద్ధి, దేశ రక్షణ ధ్యేయంగా పని చేశారని అన్నారు.
ఒక మహోన్నతమైన నాయకుణ్ణి దేశం కోల్పోయిందని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ తో వాజపేయికి మంచి అనుబంధం, సంబంధాలు ప్రేమ ఉండేవని, ఆయన ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించేవారని ప్రేమించే వారని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో వాజపేయి శకం ముగియడం బాధాకరంగా ఉందని ఆధునిక రాజకీయాల్లో వాజపేయి ధ్రువతార అని కెప్టెన్ అభివర్ణించారు. పార్లమెంటేరియన్ గా ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో ఉత్తేజితులను చేశాయని, అలాగే ఆలోచింపజేశాయని, దేశానికి మార్గనిర్దేశం చేశాయని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అన్నది ఆయన జీవితం మనకు సూచిస్తోందని కెప్టెన్ పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కలలను నిజం చేసేవిధంగా నేటి తరం రాజకీయ నాయకులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.