జనసేనపార్టీ.. జనం కోసమే పుట్టిందంటూ కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ పర్యటనల్లో బహిరంగంగానే గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం సేవించి జనసేన కార్యకర్తలు హడావిడి చేస్తున్నట్టు స్పష్టం అర్ధమవుతోంది.
పవన్ ప్రసంగిస్తున్న సమయంలో అర్ధం పర్ధం లేకుండా అరవడం, పవన్ సభలకు వెళ్లేటప్పుడు, వచ్చేటపుడు మోటార్ సైకిళ్లతో స్టంట్ లు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేస్తున్నారు. ప్రధాన విమర్శ మాత్రం పవన్ పర్యటనల సందర్భంగా ఏ ఏరియాకు వచ్చినా కుర్రాళ్లంతా మద్యం సేవించడానికి ఎగబడుతున్నారు. ఏ మద్యం షాపు వద్ద చూసినా జనసేన జెండాలు కట్టిన బైకులే కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కూడా ఇది జనసేన కాదు వైన్ సేన అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఇటీవల భీమవరంలో పవన్ ప్రజా పోరాట యాత్రలో ఇదేవిధంగా ప్రవర్తించారు. ఉండి, మహదేవపట్నం, విస్సాకోడేరుల్లోని వైన్ షాపుల వద్ద హంగామా చేసిన పవన్ అభిమానులు స్టంట్లు, సైలెన్సర్లు తీసేసి హార్న్ సౌండ్ లతో భీభత్సం చేసారు. పెదఅమిరం రోడ్డులో స్టంట్ చేసి జనాలకు తీవ్ర ఇబ్బంది గురి చేసారు.
ఈ పరిస్థితి పార్టీపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.