భారత 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శత్రుదేశాలైన భారత్ పాకిస్తాన్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పంజాబ్‌లోని వాఘా- అటారీ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ దళాలు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద కూడా సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఫుల్‌బరి పోస్టు వద్ద బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దళాలు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలతో పాటు, జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి 100 ఏళ్లు పూర్తయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 2014 నుంచి తన ప్రభుత్వ హయాంలోజరిగిన అభివృద్ధితో పాటు ఇండియన్ స్పేస్ మిషన్ 2022, మహిళా సాధికారత, భారత ఆర్ధిక వ్యవస్థ, కశ్మీర్ సహా పలు అంశాలను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని.