గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..భారతదేశ చరిత్రలో కంటివెలుగు కార్యక్రమం ఓ చరిత్రాత్మకం అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. 3 కోట్ల 70లక్షల మందికి ఉచితంగా పరీక్షలు చేయించి, అవసరమైతే ఆపరేషన్లను కూడా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ అంటే ప్రజల్లో భయం ఉంటుందని..అలాంటి భయం అవసరంలేదన్నారు. కంటి పరీక్షలను తాను కూడా చేయించుకున్నట్లు తెలిపారు. కంటిపై సరైన అవగాహనలేకనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే 40లక్షల కళ్ల అద్దాలను తెప్పించినట్లు తెలిపారు సీఎం. 825 టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించి, అద్దాలను ఇస్తారని తెలిపారు.
