చంద్రబాబుది 360డిగ్రీస్ సిద్దాంతమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కన్నా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావుగారు ఆశయాలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు మాతోపాటు ఉంటూనే కాంగ్రెస్‌తో పొత్తుకు నిస్సంకోచంగా ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీని ద్రోహి అన్న చంద్రబాబుకు 2019కి కాంగ్రెస్ పార్టీ మంచిదైపోయిందా? అని నిలదీశారు.ఏ పార్టీ మీతో అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీతో కలిసిపోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు.
బాండ్లు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇటుకల కోసం వసూలు వేసిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏ విధముగా ఖర్చు చేశారో చెప్పాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ బీరువాలో దాచారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం బాండ్ల జారీ ద్వారా సేకరించిన రెండువేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని తీవ్ర విమర్శలు చేశారు.