72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయగా పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. బీసీల ఏబీసీడీ వర్గీకరణ ద్వారా అత్యంత వెనుకబడిన బీసీ ల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి మరింత పదును పెట్టి ఆ వర్గాల అభ్యున్నతికి పెద్ద పీట వేశారన్నారు. ఎస్సీ, బీసీ హక్కుల కోసం పాటు పడుతున్న మోడీ అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పచ్చ కామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు ఉందని లక్ష్మణ్ ఆరోపించారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధిస్తే.. రాహుల్ స్వేచ్ఛ గురుంచి మాట్లాడటం విడ్డురమని ఎద్దేవా చేశారు. 10 కోట్ల కుటుంబాలకు వైద్యం అందించే మహత్తర పథకం ఆయుష్మాన్ భారత్ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.