ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్‌తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న ఎందరో సామాన్యులు జగన్‌తో తమ ఆవేదనను వెల్లబుచ్చుకుంటున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను.. విన్నపాలను ఎంతో సహృదయంతో వింటూ.. వారికి ఓదార్పుతోపాటు తానున్నానన్న ఒక భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, తన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ… నన్ను ఆదరించి, ఆశీర్వదించిన గోదావరి జిల్లాల ప్రజలకు రుణపడి ఉంటాను. మూడు నెలలపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్ర ప్రయాణం.. ప్రజలతో మమేకమవుతూ వారి జీవనశైలి తెలుసుకోవడం .. వారి అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలను పొందడం.. జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన అనుభూతి అంటూ పేర్కొన్నారు.