ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నారా? ఇన్నాళ్లు రహస్యంగా సాగించిన దోస్తీని ఆయన బహిరంగంగానే చేయదల్చుకున్నారా? రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ టూర్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆయనతో పాటుగా బస్సులో ప్రయాణించారు. రాహుల్ గాంధీ బసచేసిన హోటల్లో ఆయనతో ఆర్.కృష్ణయ్య సమావేశమయ్యారు. అనంతరం రాహుల్‌గాంధీ గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించేందుకు బయల్దేరుతుండగా ఆయనతో పాటు బస్సులో ఆర్.కృష్ణయ్య బయల్దేరారు. రాహుల్ గాంధీతో పాటు ఆర్.కృష్ణయ్య వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. టీడీపీకి తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన నేపథ్యంలో ఆయన తనదారి తాను చూసుకుంటున్నారని వివరిస్తున్నారు.