వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో సొంతవారిలా ఆదరిస్తారని నాన్నగారు ఎప్పుడూ అంటూండేవారు. అదే ఆదరణ నాకూ లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.
రాజమహేంద్రవరం బ్రిడ్జి ప్రజలిచ్చిన అఖండ స్వాగతాన్ని జీవితంలో మర్చిపోలేను. వర్షపు చినుకులు, జనసందోహం మధ్య గోదావరి వారధిపైనుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర.. అవే వర్షపు చినుకుల్లో వేలాది మంది వెంటరాగా తునిలో ముగిసింది. సహజ వనరులతో, పచ్చని పైరులతో అందంగా కనిపించే ఈ జిల్లా సమస్యలకు నిలయం.. అన్ని అర్హతలూ ఉన్నా సంక్షేమ పథకాలు అందని నిరుపేదలెందరో.. వ్యయం పెరిగి ఆదాయం తగ్గి నలిగిపోతున్న మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజల బాధలు వర్ణనాతీతం.
ఆంధ్రా అన్నపూర్ణలో ఆకలి కేకలు విన్నాను. చెంతనే గోదారి ఉన్నా తాగునీటి కష్టాలూ కన్నాను. కొబ్బరి రైతుల కష్టాలు, దింపుడు కార్మికుల బాధలు బరువెక్కించాయి. రేటు దక్కక కుదేలైన ఆక్వా రంగం ఆవేదన కలిగించింది. ఆంధ్రా కేరళగా పేరున్న కోనసీమలో క్రాప్ హాలిడేలు విస్మయం కలిగించాయి. సుదీర్ఘ సాగర తీరం, అపార మత్స్య సంపద ఉన్న ఈ జిల్లాలో మత్స్యకారులు ఉపాధి కోసం ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారు. బోటు ప్రమాదాలతో దినదిన గండంగా బతుకుతున్న లంక గ్రామాల దృష్టికి వచ్చాయి. కిళ్లీ కొట్లలోనూ, కిరాణా షాపుల్లోనూ మద్యం అమ్మకాలు సాగుతూండటం.. బెల్టు షాపులకు వేలం నిర్వహించడం చూసి.. పాలన ఇంత దిగజారిపోయిందా.. అనిపించింది. రుణాలన్నీ మాఫీ చేస్తాను.. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేర్చేస్తాను వంటి హామీలతో ఇక్కడి ప్రజల్ని మోసపుచ్చి ఓట్లేయించుకున్న పెద్ద మనుషులు అందుకు ప్రతిఫలంగా ఇసుక, మట్టితోపాటు జిల్లాలోని వనరులన్నింటినీ దోచేసి ప్రజల్ని పీడిస్తున్నారు. పాలకులపై ప్రజాగ్రహం అడుగడుగునా కనిపిస్తోంది. రాజమండ్రి నుంచి తునివరకూ ప్రతీ సభకూ వేలాదిగా వచ్చి దిగ్విజయం చేశారు. ఈజిల్లా ప్రజలు చూపిన ఆప్యాయత, అనురాగాలు గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మరిచిపోలేని అనుభూతుల్ని మూటగట్టుకుని జిల్లా దాటి వెళుతున్నాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న గత ఎన్నికలలో ఈ జిల్లా ప్రజలు 19కి 14 స్థానాలను మీకిచ్చారు. మా పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురిని కొనుగోలు చేశారు. మీరు, మీ అనుచరులు కలిసి వనరులన్నింటినీ దోచుకోవడం తప్ప ఈ జిల్లాకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా? ఈ జిల్లాకు మీరిచ్చిన హామీలు కనీసం గుర్తున్నాయా?”
అంటూ ప్రశ్నలు సంధించారు జగన్ ఈ డైరీ చదివిన మేధావులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని దశాబ్ధాల రాజకీయంలో జగన్ మాత్రమే గోదావరి జిల్లాలను కరెక్ట్ గా అంచనా వేసారని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని హామీలివ్వడం, ఇక్కడి వనరులను వినియోగించుకుని ప్రజల్ని ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారని, కులాలను నమ్మించి మోసం చేస్తుంటే జగన్ చేయగలిగిందే చెప్పారంటూ గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.