ప్రముఖ నటి స్వాతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా స్వాతి.. వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు వైపు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో వివాహ బంధంతో ఒకటికానున్నారు. ఆగస్ట్ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటల సమయంలో వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న కొచ్చిలో వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నారట.వికాస్ మలేసియన్ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వికాస్ స్వస్థలం ఇండోనేషియా రాజధాని జకార్తా. వివాహం తర్వాత స్వాతి తన భర్తతో కలిసి అక్కడే స్థిరపడనున్నారు. ‘కలర్స్’ టీవీ షో ద్వారా స్వాతి బుల్లితెరకు పరిచయమయ్యారు. దాంతో ఆమె ‘కలర్స్’ స్వాతిగా సుపరిచితురాలు అయ్యారు. ఆ తర్వాత 2005లో వచ్చిన ‘డేంజర్’ చిత్రంతో నటించారు. ఆ తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘త్రిపుర‘ తదితర చిత్రాల్లో నటించారు.