పిడుగురాళ్ల అక్రమ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో అక్రమ మైనింగ్ డాన్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అవన్నీ చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో అసలు దొంగలను వదిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అసలు ఎమ్మెల్యే యరపతినేనిని ప్రభుత్వం ఈ కేసును ఎలా బయట పడేస్తుంది…? ఈ కేసును ఎలా నీరుగారుస్తోంది…? అసలు ప‌్రభుత్వం ప్లానేంటి..?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సున్నపురాయి అక్రమ క్వారీ కేసు చంద్రబాబు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పల్నాడులోని కోనంకి, నడికుడి, ఇంకా పలు గ్రామాల్లో యరపతినేని శ్రీనివాసరావు తన అనుచరులతో అక్రమంగా సున్నపురాయి నిక్షేపాలను దోచేస్తున్నాడు. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఎల్లప్పుడూ ఉండటంతో గత నాలుగేళ్ల నుంచి ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా.. చేసిందే శాసనంగా మారింది. దీంతో గురజాల నియోజకవర్గంలో ఉన్న సున్నపు రాయిని దోచేస్తూ… అక్రమ మైనింగ్ డాన్‌గా ఎదిగారు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. దాదాపు రూ.500 కోట్లు విలువ చేసే సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా దోచేసినట్టు పల్నాడులో ప్రచారం జరుగుతోంది.
అయితే, హైకోర్టు సంవత్సరం క్రితం ఈ అక్రమ మైనింగ్‌పై విచారణ జరపాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా, అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు.. మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మైనింగ్ అధికారులపై తీవ్రంగా ఆగ్రహించింది. గత నాలుగేళ్ల నుంచి ఎంత మైనింగ్ జరిగింది..? ఎంత మేరకు లావాదేవీలు జరిగాయి..? ఎంత మొత్తంలో సున్నపురాయి అక్రమంగా తరలిపోయింది..? ప‌్రభుత్వ ఖజానాకు ఎంత మేరకు నష్టంవాటిల్లింది అన్న దానిపై ఈ నెల 21వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని మైనింగ్ శాఖ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఖంగుతిన్న అధికారులు సర్వే పేరుతో రెండు రోజులపాటు హడావుడి చేశారు. శాటిలైట్ మ్యాప్ ద్వారా సర్వే చేయకుండా తూతూ మంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకున్నారు.
మరో వైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురజాల ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. యరపతినేనిని రక్షించేందుకు ప్రభుత్వం పక్కాప్లాన్‌తో ముందుకు వెళుతోంది. అక్రమమైనింగ్‌కు పాల్పడిన వారు ఎవరో తెలిసినా కూడా అధికారులు వారిని విచారించడం లేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పైగా అక్రమ మైనింగ్‌కుఎటువంటి సంబంధం లేని దాదాపు 120 మందికి నోటీసులు ఇవ్వడానికి మైనింగ్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆరుగురు మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు.
అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యరపతినేని శ్రీనివాసరావును ఈ కేసు నుంచి బయటపడేయాలన్నది ప్రభుత్వ పెద్దల ప్లాన్. మైనింగ్ అధిరకారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు ఒక మిల్లును రోజంతా నడిపారు.ఒక్క రోజు మిల్లు నడిపితే.. ఎంత కరెంటు ఖర్చు అవుతుందో..నోట్ చేసుకున్నారు. ఒక్క రోజులో కాల్చిన సున్నపురాయిని చిన్న చిన్న ముక్కలుగా చేశారు. దానిని పొడిగా చేసి.. ఎంత సున్నపురాయి అవసరమైంది అని నెలకు, సంవత్సరాలకు లెక్కకట్టి ఒక లిస్టును తయారు చేశారు. 2001 నుంచి భారీ స్థాయిలో కరెంటు వినియోగించారు కాబట్టి .. అదే స్థాయిలో రాయల్టీ కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. ఒక వేళ మిల్లర్లు ఆ నోటీసులు తీసుకుని.. రాయల్టీ కడితే.. అక్రమ మైనింగ్‌లో మాయమైన సున్నపురాయి ముడి సరుకు విలువను మిల్లర్ల ఖాతాలో వేసి.., ఆరోపణలు ఎదుర్కొంటున్న యరపతినేనిని కాపాడాలన్నది చంద్రబాబు ప్లాన్.