ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు స్టేషన్ తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఈసందర్భంగా బొత్స మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దారుణ పరిస్థితులు చూడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ లేవని దుయ్యబట్టారు.
వాస్తవాలు చూసేందుకు వెళితే ప్రభుత్వానికి ఎందుకు భయమని, గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తున్నామని, ఎందుకు ప్రభుత్వానికి ఇంత భయమన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వాటా ఇస్తున్నందుకే పోలీసులతో వైసీపీని అణచివేయిస్తున్నారని బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం పర్యవసానం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.