ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తునిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్, ఈసారి తన శైలికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మాట్లాడారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు పాలనలో ఈ నాలుగేళ్లలో మనం చూసిందేమిటంటే అబద్ధం, మోసం, అవినీతి, అన్యాయం తప్ప మరొకటి చూడలేదు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడిగా కావాలా? అని ప్రజలకు సూచించాడు.
ఇంకా మన పిల్లలను బాగా ఇంగ్లీషు చదువుకోవాలని చెప్పి ప్రైవేటు స్కూళ్లకు పంపుతాం. ఇవాళ ప్రైవేటు స్కూళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. చంద్రబాబు స్వయంగా నారాయణ, చైతన్యల పేరుతో తానే బినామీ స్కూళ్లను నడుపుతున్నారు. ఒక పేదవాడు, మధ్య తరగతి వాడు తన పిల్లలను స్కూలుకు పంపించాలంటే.. ఏటా రూ.40 వేలు ఖర్చవుతోంది. చివరకు కళాశాలలకు పంపించాలంటే ఒక విద్యార్థికి రూ.65 వేలు నుంచి రూ.70 వేలు ఖర్చు అవుతోంది. అదే నారాయణ కళాశాలకు ఒక విద్యార్థిని పంపాలంటే ఏడాదికి రూ 1.60 లక్షలు గుంజుతున్నారు. (అవును.. అవును.. అంటూ జనం నుంచి భారీ స్పందన) పేద, మధ్య తరగతి కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలను చదివించగలిగే పరిస్థితి ఉందా? అందుకే.. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్కూలు, కాలేజీ ఫీజులను తగ్గిస్తానని జగన్ అనే నేను.. మీ అందరికీ హామీ ఇస్తున్నానని జగన్ అన్నారు. దీంతో ప్రజల్లో కొత్త ఆశ చిగురించేలా వైఎస్ జగన్ మరో సరికొత్త హామీ ఇవ్వడంతో ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.