అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. లక్షా 96వేలమంది ఓటర్లుండగా.. వజ్రకరూరు, బెళగుప్ప, ఉరవకొండ, కూడేరు, విడపనగళ్లు మండలాలున్నాయి. మొత్తం 12సార్లు ఎన్నికలు జరగగా.. 5సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు రెండుసార్లు, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఎక్కువశాతం కుటుంబాలు కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి..
అయితే ఇక్కడి ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోయినా పోరాడి అభివృద్ధి చేస్తున్నారు వైవీరెడ్డి. ప్రజలకు మేలు జరగడమే తనకు ముఖ్యమంటూ వైవీ రెడ్డి ముందుకెళ్తున్నారు. అలాగే పార్టీలో మాజీ శాసనసభ్యుడు శివరామిరెడ్డి తో ఉన్న విబేధాలను అధిగమించి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జగన్ నమ్మినబంటుగా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సభలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గురించి మాట్లాడుతూనే దివంగత సీఎం రాజశేఖరరెడ్డిని పొగిడారు. హంద్రీనీవా గురించి మాట్లాడినపుడు రాజశేఖరరెడ్డి హయాంలోనే పనులు జరిగాయని ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా మనందరి కృషి వల్లే జరిగాయని చెప్పారు. అదే వేదికపై ఐదారు నిమిషాలు వైవీ రెడ్డి మాట్లాడారు. సీఎం సభలో వైసీపీ ఎమ్మెల్యే అంతసేపు మాట్లాడడం బహుశా అదే మొదటిసారి.
విద్యార్ధి సంఘ నాయకుడిగా, వామపక్ష పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి వైసీపీలో చేరారు. 2014లో కేవలం ఇద్దరు మాత్రమే వైసీపీనుంచి గెలవగా చాంద్ భాషా అధికార తెలుగుదేశంలోకి మారారు. కానీ వైవీ రెడ్డి అధికార పార్టీవైపు కన్నెత్తికూడా చూడలేదని, ప్రలోభాలకు లొంగలేదనే సానుభూతి కూడా ప్రజల్లో ఉంది.
హంద్రీనీవాకు నీరు విడుదల చేయాలని, 100 టీఎంసీలు నీరిచ్చి 1000కోట్లు కేటాయించాలని 25గంటలపాటునిరాహార దీక్ష విజయవంతం చేసారు. అనంతలో ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యేకు ఆస్థాయిలో జనం రావడం కూడా రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఉరవకొండలో ఇళ్ల స్థలాల సమస్య కోసం పోరాటం కూడా చేసి హౌస్ అరెస్ట్ అయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
మరోవైపు పయ్యావుల చేస్తున్నట్టు చెప్పుకుంటున్న అభివృద్ధి పనులు కేవలం ఓట్లకోసం చేస్తున్న స్టంట్ మాత్రమేనని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పగలుగుతున్నారు. ప్రలోభాలకు లొంగి పార్టీ మారలేదనే సానుభూతి, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉరవకొండ వాసులను ఆకట్టుకుంటోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి వైవీరెడ్డి భారీమెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.