వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా.. ఘన స్వాగతం లభిస్తోంది. కాగా, ప్రజా సమస్యలపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తుని 103వ నియోజవర్గం. వైఎస్ జగన్ రాకతో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ పాదయాత్ర 2700 కి.మీ మైలు రాయిని దాటనుంది. ఇందు కోసం వైసీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
234వ రోజు పాదయాత్రను ప్రత్తిపాడు నియోజకవర్గం డిజే పురం నుంచి ప్రారంభించిన జగన్ తుని నియోజకవర్గంలోని కొత్తవేలంపేట, సీతయ్యపేట, కొవ్వుకొత్తూరు, తాళ్లూరు జంక్షన్ వరకు నడిచారు. మధ్యాహ్నం తరువాత తుని చేరుకోనున్న వైఎస్ జగన్ భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
మరో రెండు రోజుల్లో తుని నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకుని మంగళవారం నాటికి విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు వైఎస్ జగన్.
అయితే, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్ కోసం తుని నియోజకవర్గం ప్రజలు తరలి వచ్చారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు చిన్నా, పెద్దా అంతా ఏకమయ్యారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తుని నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న వైఎస్ జగన్‌కు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. కోలాటం ఆడుతూ స్వాగతం పలికారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.