తెలంగాణ రాష్ట్ర సమితినపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని అయినా వారు తీరు మారడం లేదన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో జేడీయూకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నాయకుడు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారని బాల్క సుమన్ గుర్తు చేశారు. తమకు మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ నేతలు ఒక్కరైనా అడిగారా అని సుమన్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులది అహంకార ధోరణి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోందని బాల్క సుమన్ ప్రశ్నించారు. అడగకున్నా తమకు ఓటు వేయాలని అహంకారంతో వ్యవహరించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు,కుట్రలు కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో చిన్న సైజ్ ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ ముందు కాంగ్రెస్ పార్టీ మొకరిల్లిందని, మోడీ ముందు కేసీఆర్ మొకరిల్లలేదని, కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు ముందు మోకరిల్లారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని, వాటిని ఎలా అడ్డుకోవాలి అని కాంగ్రెస్ చూస్తుందని సుమన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు పాటించని సిగ్గులేని పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు.కేంద్రం, పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించాలని టీఆర్ఎస్ భావిస్తోందని సుమన్ అన్నారు. “కాంగ్రెస్ నేతల అధిష్టానం ఢిల్లీలో వీళ్ల జుట్టు ఆంధ్ర నేతల చేతిలో ఉంది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సంబందాలు ఉంటాయి కానీ మేము ఏపార్టీ తోటి అంట కాగిలేము. బీజేపీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు.పార్లమెంట్ లో రాహుల్ కౌగిలింతలు, కన్నుగొట్టుడు అందరూ చూశారు.. ఈ డ్రామాలు ఆపకపోతే దేశంలో కాంగ్రెస్ లేకుండా పోతుంది“ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పలేదని, కాంగ్రెస్ నేతలు చెప్పేవి అన్ని అబద్ధాలని బాల్క సుమన్ తెలిపారు. “కేసీఆర్ కుటుంబం ఆదానీ తో పోటీ పడుతుందా? నోరు జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఆధారాలు ఉంటే బయట పెట్టు“ అంటూ సవాల్ విసిరారు.
Tags balka suman cm congress kcr mp peddapalli telangana tpcc trs