ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ముస్లింలకు ఒక మంత్రి పదవిని ఇచ్చేసి.. ప్రచార ఆర్భాటం మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులూ గుర్తుకురాని ముస్లింలు ఎన్నికల ముందు చంద్రబాబుకు గుర్తుకు వస్తున్నారు.
దీంతో ఈ పునర్వ్యస్థీకరణలో కొన్ని వికెట్లు పడబోతున్నాయని కూడా అంటున్నారు. ఇలా పదవులను కోల్పోయే వారిలో మొట్ట మొదటగా కర్నూల్ జిల్లా నుండి మంత్రి భూమా అఖిలప్రియ ఉండబోతోందని సమాచారం. అఖిలప్రియకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవిని ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బాబు పెట్టిన ఒత్తిడికి తాళలేక భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పాలయితే… ఎలాగూ నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయనే లెక్కలతో, సానుభూతిని వాడుకోవచ్చని చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చాడు. తన తండ్రి మరణిస్తే అందుకు కారణం చంద్రబాబే అవుతాడని హెచ్చరించిన భూమా అఖిలప్రియ ఎంచక్కా బాబు కేబినెట్లో మంత్రి అయ్యింది. అది కూడా తండ్రి చనిపోయాకా. ఇప్పుడైతే అఖిలప్రియతో బాబుకు దాదాపుగా అవసరం తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రిగా కూడా అఖిలప్రియ పనితీరు ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖిలను తప్పించినా అడిగే వారు ఉండరనే కాన్ఫిడెన్స్ చంద్రబాబుకు ఎలాగూ ఉండనే ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల విషయంలో బాబు తదుపరి లెక్కల కోణం నుంచి చూసినా.. అఖిలప్రియకు ప్రాధాన్యత చాలావరకూ తగ్గబోతోంది. ఈ పరిణామాల మధ్యన కేబినెట్ నుంచి అఖిలను తప్పించవచ్చు అనే ప్రచారం గట్టిగా సాగుతోంది.