విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న దశలో ఒకరి సీటుపై.. మరొకరు కన్నువేయడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 చోట్ల టీడీపీ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి వలస వెళ్లిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ దశలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీట్ల కోసం టీడీపీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట తీవ్రమైందట. ముఖ్యంగా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మంత్రి గంటా వర్గీయులతో ఆరంభం నుంచి పార్టీలో ఉన్న నేతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయట. ప్రతీ ఎన్నికలోనూ నియోజకవర్గం మారే ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సారి తనకు అనువుగా చోడవరం, అనకాపల్లి, విశాఖ ఈస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయని సర్వేల ద్వారా నిర్ధారించుకున్నారట. దీంతో గంటాపై అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేశన్ రాజు, పీలా గోవింద్, వెలగపూడి రామకృష్ణబాబు గుర్రుగా ఉన్నారట. వీరంతా మంత్రి అయ్యన్నవర్గంలో ఉంటూ గంటాపై అవకాశం దొరికినప్పుడల్లా దాడి చేస్తున్నారట. అదే సమయంలో మంత్రి గంటా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించే పనిలో పడ్డారట.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడైన ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావును రాత్రికి రాత్రే ఏయూ రిజిస్ట్రార్ పోస్టు నుంచి మంత్రి గంటా తప్పించడం తమ్ముళ్లమధ్య దూరం పెంచిందట. అలాగే, పశుసంవర్ధకశాఖ పాలక మండలి విషయంలో కూడా అయ్యన్నవర్గీయుడిని కాదని తన అనుచరుడ్ని చైర్మన్‌గా నియమించుకున్నారు. దీంతో విశాఖ భూముల కుంభకోణంలో మంత్రి గంటా అనుచరుల ప్రమేయంపై అయ్యన్న వర్గీయులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో గంటా మనస్థాపానికి గురయ్యారట. భీమిలి నుంచి పోటీ చేసిన గంటా సీటుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కన్ను వేశారట. దీంతో గత రెండు ఎన్నికల్లో గంటా ద్వారా సీటు కోసం యత్నించిన అవంతి ఈ సారి నేరుగా అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారట.
యలమంచిలి ఎమ్మెల్యే పంచికర్లకు స్థానికంగా వ్యతిరేకత వచ్చిందట. సామాజికవర్గం కోటాలో పెందుర్తి లేదా విశాఖ నార్త్ టిక్కెట్ ఇప్పించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారట పంచికర్ల, దీంతో పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు పంచకర్లపై కారాలు మిరియాలు నూరుతున్నారట. ఇందులో భాగంగానే ముదుపాక భూముల కుంభకోణం జెర్రిపోతులపాలెంలో మహిళపై దాడి ఘటనను ప్రచారం చేస్తున్నారని బండారు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. విశాఖ భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని తప్పించాలని పార్టీలోని ఓ వర్గం ప్రయత్నిస్తుందని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా ఆగ్రహంతో ఉన్నారట. దీనికి తగ్గట్టు అనకాపల్లి నూకం – బిక్కాం అమ్మవారి ఆభరణాలు జనం డబ్బుతో చేయించారంటూ పీలాపై వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది.
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై పార్టీలో ప్రతికూల వాతావరణం ఉంది. పార్టీలో చేరాలని భావిస్తున్న కొందరు అధికారుల్లో ఒకరికి అనితకు వ్యతిరేకంగా సీటు ఇప్పించాలని ఓ వర్గం ప్రయత్నిస్తుందట. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గట్టెల సుమన్‌ను బరిలోకి దించేందుకు అనిత వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తోందట. మంత్రి అయ్యన్నకు నియోజకవర్గ టీడీపీలో తీవ్ర వ్యతిరేకత ఉందట. అయ్యన్న రాష్ట్రానికి మంత్రిగా కాక, నర్సీపట్నం నియోజకవర్గం మంత్రిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారట.
అరకు ఎమ్మెల్యే కిడారు బంధువులు నిర్వహిస్తున్న ఓ ఊడ గ్రామ క్వారీపై గిరిజనులు సీరియస్‌గా ఉన్నారట. అదే రీతిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటా, బయటా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారట. ఇలా అంతర్గత పోరుతో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరి సీటుకు ఇంకొకరు ఎర్త్ పెట్టుకుంటున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది.