ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది పార్టీల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. 2014లో టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైసీపీ ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల నుంచి సహకారం లభిస్తోంది. వైసీపీని ప్రజలు ఆదరిస్తున్నారని, టిడిపిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిఫలితంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ఆపార్టీ నాయకులే చెబుతున్నారు. మార్కాపురం నియోజకవర్గంనుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున జంకే వెంకటరెడ్డి గెలుపొందారు. జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఆయన మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉండడంతో ఆయనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఓటు బ్యాంక్‌గా పరిగణించే ఈ వర్గాలు మళ్లీఆయనే అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక్కడ టిడిపి గెలవడం అసాధ్యమట.. యర్రగొండపాలెంలో డేవిడ్‌రాజు, గిద్దలూరునుంచి గెలిచిన అశోక్ రెడ్డిలు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వీరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కూడా వీరిద్దరి పనితీరు ఏమాత్రం బాగాలేదని తేల్చారట. దీంతోఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గిద్దలూరు టిడిపి తరుపున పోటీ చేసిన అన్నే రాంబాబు పార్టీని వీడిపోవడం పార్టీని బలహీనపర్చింది. అలాగే కందుకూరు నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి బలహీనపడిందని, పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీమారిన పోతుల రామారావుకు ఓటుతో పోటు వేసేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు.
అలాగే, కాంగ్రెస్ నేత, మాజీమంత్రి మహిధర్‌రెడ్డి వైసీపీలో చేరడం ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ఇక్కడ మళ్లీ వైసీపీనే గెలుస్తుందట.. కనిగిరిలో పరిస్థితి కొంచెం అటూ ఇటుగా ఉందట.. ఇక్కడ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన ‘కదిరి బాబూరావు’ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదట.. దాదాపుగా ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయమైపోయిందట.. అలాగే దర్శి, సంతనూతలపాడు, కొండేపి, చీరాలల్లో కూడా వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయట.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిపెడితే స్వల్ప మెజార్టీతోనైనా ఒంగోలు, అద్దంకి, పర్చూరు వంటి నియోజకవర్గాల్లో టిడిపి జిల్లా మొత్తమ్మీద మూడు, నాలుగు స్థానాల్లో అయినా టీడీపీ గెలవగలదని తెలుస్తోంది. మిగతా ఎనిమిది స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయంగా స్పష్టమవుతోంది.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, తూతూ మంత్రంగా అభివృద్ధి కార్యక్రమాల సభలు మినహా పార్టీ వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, సంక్షేమ పధకాల అమలులో జాప్యం, కనీసం ఆధ్యాత్మిక వైభవం ఉన్న దేవాలయాలనూ విస్మరించడంతో ప్రజాగ్రహం అథికార పార్టీకి తప్పేలా లేదు. జనసేన పార్టీ ప్రభావం ఈ జిల్లాలో రెండుశాతానికి మించి కనిపించడం లేదు.