ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు తీసి.. అడుగు వేస్తే చాలు ప్రత్యేక విమానాల్లో విహరిస్తారు. మీటింగు పెట్టినా.. రివ్యూ చేసినా అంతా ఫైవ్ స్టార్ రేంజ్‌లోనే ఉంటుంది. లోటు బడ్జెట్‌తో విలవిలలాడే పేద రాష్ట్ర ముఖ్యమంత్రినని మరిచిపోయి దుబారా చేస్తూనే ఉంటారు. సీఎం చంద్రబాబు చేస్తున్న దుబారా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పెట్టిన ఖర్చు చూసి దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలంతా షాక్ తింటున్నారు. సీఎం చంద్రబాబు ఒక్క రోజు బెంగళూరుకు వెళ్లొచ్చినందుకు ఆయన పెట్టిన ఖర్చు అక్షరాల 8 లక్షల రూపాయలు. నిత్యం ప్రత్యేక విమానాలు, సెవెన్ స్టార్‌కు తగ్గని ఆతిధ్యం అనుభవిస్తూ తాను పేదల కోసం అత్యంత పేదగా మారి పనిచేస్తున్నాను అని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు అసలు తీరిది.
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చాలా మంది నేతలే వచ్చారు. కానీ, వారందరిలోనూ సీఎం చంద్రబాబు నాయుడు ఖర్చే అత్యధికంగా ఉండటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కేవలం ఒక్క రోజు కూడా పూర్తిగా అక్కడ ఉండకుండానే ఆయన 8.7 లక్షల రూపాయలు కర్ణాటక ప్రభుత్వంతో ఖర్చు పెట్టించారు. ఈ సంవత్సరం మే 23న బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో చంద్రబాబు నాయుడు బస చేశారు.
సీఎం ప్రమాణ స్వీకారానికి ఎళ్లిన నేపథ్యంలో ఆ గదిని మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు ఖాళీ చేశారు. కానీ, చంద్రబాబు నాయుడు చేసిన బిల్లు మాత్రం ఎవరికీ అందనంత రీతిలో ఉంది. ఇదే ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యయం కేవలం రూ.లక్షా 85 వేల రూపాయలు మాత్రమే. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోసం రూ.లక్షా 2వేలు, సీతారామ్ ఏచూరిపై 64వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎంఐఎం నేత ఓవైసీ కోసం రూ.38 వేలు ఖర్చు చేశారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకున్న బెంగళూరుకు చెందిన ఓ పత్రిక ఈ వివరాలను బయటపెట్టింది.
ఎంతయినా.. పేద చంద్రబాబు ఆ మాత్రం ఖర్చు పెట్టించడాన్ని ఎవరైనా తప్పుబడతారా..? 17 గంటలకు గాను, 8.7 లక్షల రూపాయలు ఖర్చు చేశారంటే.. ఈయన దుబారా చూసి అందరూ విస్తు పోతున్నారు. కర్ణాటకలో ఈ దుబారపై ఇప్పుడు తీవ్రమైన రచ్చ జరుగుతోంది.