పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందించాల్సిందేనన్నారు. అట్టి చెక్కును కుటుంబ సభ్యులకు చేరే విధంగా, యంత్రాంగాన్ని నియమించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భీమా మొత్తం బాధ్యులకు చేరేక్రమంలో తలెత్తే బాలారిష్టాలు, నియమ నిబంధనల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ కార్యదర్శులదే నని స్పష్టం చేశారు. వీరిరువురు సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన వారికి భీమా చెక్కును అందించడంలో వీరిద్దరిదే భాధ్యత అని సిఎం తేల్చి చెప్పారు. కాలధర్మం చేసిన అర్హుడైన/అర్హురాలైన రైతుకు 48 గంటల కాలపరిమితిలో మరణ ధృవీకరణ పత్రాన్ని అందచేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శిదేనని స్పష్టం చేశారు.
శుక్రవారం ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారధి, కమీషనర్ జగన్ మోహన్ రావు, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమీషనర్ నీతూ ప్రసాద్, సిఎంవో అధికారులు భూపాల్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
రైతుకు భీమా అందే క్రమంలో దశల వారిగా తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. రైతు మరణించిన వెంటనే సదరు సమాచారాన్ని ఎవరు నమోదు చేసుకోవాల్సి వుంటుంది.? ఆ సమాచారాన్ని ముందుగా ఎవరికి చేరవేయాలె.? ఈ సమాచారం జీవిత భీమా సంస్థ అధికారులకు ఎట్లా తెలియజేయాలె.? ఈ క్రమంలో ప్రభుత్వం భీమా సంస్థతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అన్ని నియమ నిబంధనల్లో వ్యవసాయ విస్తరణ అధికారి పాత్ర., గ్రామ కార్యదర్శి పాత్ర., రైతు సమన్వయ సభ్యుల పాత్ర యేవిధంగా వుండాలో స్పష్టం చేశారు. బాధలో ఉన్న రైతు కుటుంబం ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి పదిరోజుల్లోపు భీమా చెక్కు అందే విధంగా అడుగడుగున ఏ విధమైన చర్యలు చేపట్టాలో అటు పంచాయితీ రాజ్ ఇటు వ్యవసాయ అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘దాదాపు 636 కోట్ల రూపాయలతో 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకాన్ని మనం ప్రారంభిస్తున్నం. గ్రామస్తాయిలో అర్హులైన రైతుల పేర్లు తదితర వివరాలు వ్యవసాయ విస్తరణాధికారి ట్యాబ్ లో తనవెంట అందుబాట్లో వుండాలె. ఈ నెల పద్నాలుగు తారీఖు అర్థరాత్రి నుంచే ఈ పథకం అమలులోకి రానున్నందున ఆ సమయం తర్వాత ఏ కారణం చేతనైనా అర్హుడైన రైతు మరణిస్తే.. అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలను నిర్ణీత సమయం అంటే పదిరోజుల్లో అందచేయాలె. ఇందుకు సంబంధించిన అమలు కార్యాచరణకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలె. మరణించిన రైతు వివరాలతో కూడిన సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు అందించడంలో రైతు సమన్వయ సభ్యులు, సమన్వయ కర్తలు చురుకైన పాత్రను పోశించాలె. మరణ ధృవీకరణ పత్రాన్ని వ్యవసాయాధికారికి 48 గంటల లోపు అందించడంలో గ్రామా కార్యదర్శిదే పూర్తి బాధ్యత. స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (ఎఈవో) మరణించిన రైతు నివాసానికి వెల్లి సేకరించిన సమాచారాన్ని వెంటనే జిల్లా స్తాయిలో ప్రత్యేకంగా ఇదే పనిమీద నియమించబడిన జిల్లా వ్యవసాయ అధికారికి (డీఈవో) అందించాలె. అక్కడ ఆయన సంబంధిత పత్రాన్ని పరిశీలించి, తదుపరి తిరస్కరణకు గురికాకుండా ఎల్. ఐ. సీ అధికారులకు పంపించాలె. రైతు భీమా పథకాన్ని ప్రతిష్గాత్మకంగా భావిస్తున్న జీవిత భీమా సంస్థ వారు ఇందుకోసం ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసుకున్నారు. అందువలన నిర్ణీత సమయంలో భీమా చెక్కు అర్హులకు అందుతది. ఈ ప్రక్రియ ఖశ్చితంగా అమలయ్యే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలె, వారికి పంచాయితీ రాజ్ శాఖ సహకరించాల్సి వుంటది’’ అని అధికారులకు వివరించిన ముఖ్యమంత్రి, రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. ఒకవేళ రైతు భీమా పథకం లో ఇప్పటికి ఇంకా పేరు నమోదుకాని అర్హులైన రైతులు ముందుకు వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవచ్చని. వారికి సంబంధిత ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు.