తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సీనియర్ మోస్ట్ నేతల్లో ఒకరైన అయ్యన్న పాత్రుడికి తమ్ముడు పోరు ఎక్కువైందట. కొద్ది రోజుల క్రితం అయ్యన్నకు చతుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు తమ్ముళ్లకు తాజాగా ఆయన సోదరుడు చింతకాయల సన్యాసి పాత్రుడు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలియడంతో షాక్‌కు గురయ్యారట.
దాదాపు 30 ఏళ్లకుపైగా అన్న అయ్యన్నతో తిరుగుతూ రాజకీయ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న సన్యాసి పాత్రుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకేమి తక్కువ అని కేడర్ ముందు చెప్పుకుంటున్నారట. అన్న రాజకీయ ఎదుగుదలకు కారణమైన సన్యాసి పాత్రుడు, అయ్యన్న పాత్రుడు కుటుంబాల మధ్య గత రెండేళ్ల నుంచి విభేదాలు కొనసాగుతున్నాయట. సన్యాసి నాయుడు ప్రయణిస్తున్న కారులో మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ పాత్రుడు రహస్యంగా వాయిస్‌ను రికార్డ్ చేయడం పెను దుమారం రేపింది. అది కాస్తా, పోలీసు స్టేషన్ గుమ్మ వరకు వెళ్లి కుటుంబం పరువు పోకుండా కేసు విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చిందట. దీంతో నాటి నుంచి అన్న దమ్ముళ్ల మధ్య వార్ జరుగుతుండట. కేవలం అధికార కార్యక్రమాలు తప్ప.. అన్నకు సంబంధించిన మరే ఇతర వ్యక్తిగత కార్యక్రమాల్లో తమ్ముడు సన్యాసి పాత్రుడు పాల్గొనం లేదట.
మరో వైపు 30 ఏళ్లుగా అన్నవెంట ఉన్నా, అనుభవం తప్ప.. రాజకీయ ఎదుగుదల ఏ మాత్రం లేదని సన్యాసి పాత్రుడు భావించాడట. అలాగే, అన్న కూడా తన రాజకీయ అభివృద్ధికి సహకరించలేదని సన్యాసి పాత్రుడు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా భార్య హరిత ఉండగా, వైస్ చైర్మన్‌గా సన్యాసి పాత్రుడు కొనసాగుతున్నారు. కేవలం సర్పంచ్ స్థాయికే పరిమితం చేసి వదిలేసిన అన్న తీరును చూసి కోపంతో తమ్ముడు రగిలి పోతున్నాడట. దీంతో అయ్యన్న పాత్రుడిపై తిరుగుబాటు తప్పదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారట సోదరుడు సన్యాసి పాత్రుడు. దీంతో అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే రీతిలో వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు తన ఇంటెలిజెన్స్ వర్గాలతో సర్వే కూడా చేయించారట. 2019 ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిపై 20,338 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని తేల్చేసింది.