ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో నగరి టీడీపీ మూడు ముక్కలైంది. దివంగత నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం రెండు వర్గాలుగా విడిపోగా కొత్తగా సినీ నటి వాణి విశ్వనాథ్ తెరమీదకు వచ్చారట. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెనక్కు సాగుతుండటంతో.. ఈ గ్రూపుల గోల ఏమిటని తల పట్టుకోవడం పచ్చతమ్ముళ్ల వంతైంది.
నగరి నియోజకవర్గంలో గాలి మద్దు కృష్ణమ నాయుడు జీవించి ఉన్నప్పట్నుంచి ఆయన కుమారుల్లో తారా స్థాయిలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు భాను ప్రకాష్, చిన్న కుమారుడు జగదీష్‌ల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో ఒకవారం ఒక కుమారుడ్ని.. మరో వారం మరో కుమారుడ్ని వెంట తీసుకెళ్లే వారు. గాలి మరణం తరువాత ఆయన ఇద్దరు కుమారులు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడ్డారట. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నా కుమారులు ఇద్దరూ వెనక్కు తగ్గకపోవడంతో మధ్య మార్గంగా ఆ ఎమ్మెల్సీ పదవిని గాలి సతీమణి సరస్వతికి కేటాయించాల్సి వచ్చింది.
సరస్వతమ్మ నామినేషన్ సందర్భంగా కూడా గాలి కుమారులు అధినేత ముందు బలప్రదర్శనకు దిగారు. వచ్చే ఎన్నికల్లో నగరి టీడీపీ తనకేనంటూ ఎవరికి వారే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అనుచరులతో కలిసి నియోజకవర్గాన్ని సోదరులిద్దరూ తెగ చుట్టేస్తున్నారట. గాలి కుమారుల మధ్య నగర పంచాయతీ కొనసాగుతుండగానే.. తాను కూడా రేసులో ఉన్నానంటూ వచ్చేసింది వాణీ విశ్వనాథ్.
వెండితెర మీద నుంచి.. పొలిటికల్ తెర మీదకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అందులో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారట. అంతేకాకుండా ,అమరావతికి వెళ్లి సీఎం కోటరీతో వాణి విశ్వనాథ్ చర్చలు జరిపినట్టు సమాచారం. ఇలా నగరి టీడీపీ లో మూడు వర్గాల రాజకీయం 2019లో వైసీపీ ఎమ్మెల్యే రోజా గెలుపును మరింత సులువు చేయనున్నాయి.