ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారనే ఆయన యూటర్న్ తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వంచనపై గర్జన కార్యక్రమంలో ఆర్కే మాట్లాడుతూ నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు కేసీఆర్ ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హోదాకోసం పోరాడిన వారిపై చంద్రబాబు కేసులు ఎత్తివేయడంలేదని, శాసనసభలో హోదాసాధనకు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించలేదన్నారు. తమ ప్రాణాలను, పదవులను రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎంపీలు ముందుకు రావడం దేశచరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఐదుగురు ఎంపీలతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నాయకుడైతే రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నాడో ఆయనే జగన్ అని జగన్ వెంట ప్రజలంతా నడవాలని కోరారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలన్నారు.
