డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే, పలు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై నగర పరిధిలోగల కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆగస్టు 7 2018 – 6.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చెన్నై నగరానికి తరలి వస్తున్నారు. కరుణానిధి భౌతిక ఖాయాన్ని సందర్శించి.. కన్నీటి నివాళులర్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కరుణానిధికి చికత్స అందించిన వైద్యుడు అరవిందన్ సెల్వరాజ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోకంటే కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత క్షీణించిందని, అప్పటికీ ఆయనకు అత్యంత మెరుగైన చికిత్సను అందించి కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని తెలిపారు. అయితే, కరుణా నిధి గుండె, ఊపిరితిత్తులు, ఇంకా పలు అవయవాలు తాము చేస్తున్న చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ వయోభారం కారణంగా తలెత్తే సమస్యలు ఆయన్ను ఇబ్బంది పెట్టాయని, దాంతో చికిత్సకు కొంత మేర అవరోధం ఏర్పడిందని వెల్లడించారు. కరుణానిధి కేవలం వయోభారం రీత్యా మరణించారే తప్ప.. ఆరోగ్యం రీత్యా కాదని అరవిందన్ సెల్వరాజ్ పేర్కొన్నారు.