దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలపై కొన్ని కారణాలవల్ల ప్రజా వ్యతిరేకత ఉంది.. ఇది కాదనలేని నిజం.. అయితే త్వరలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజా వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనలో మోదీ, అమిత్ షాలు తమకు సానుకూల పవనాలు వీస్తేనే 2019 ఎన్నికల్లో గెలవచ్చన్న భావనతో ఉన్నారు.. ఈ క్రమంలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటివి మర్చిపోయేందుకు ఆదాయపు పన్నును రద్దు చేసి బీటీటీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారట.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు వెళ్లి 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే, కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చాలన్న ఉద్దేశంతో ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని భావిస్తున్నారట.
ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, తన నోటివెంట ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని బీజేపీ నేతల్లో ప్రచారం చేసారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోదీపై ప్రజా వ్యతిరేకతను పెంచగా, దాన్ని తగ్గించకుంటే, గెలుపు క్లిష్టతరమవుతుందన్న ఆలోచనలో కమలనాథులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దేశ ప్రజలను సంతోషంలో ముంచడానికి సిద్ధమవుతున్న మోదీ, ఆదాయపు పన్నును రద్దు చేస్తే, గెలుపు సులువవుతుందని మోదీ,షాలు నమ్ముతున్నట్టు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరమూ బడ్జెట్ ను ప్రవేశపెట్టే వేళ, ఆదాయపు పన్ను పరిమితులను పెంచుతారా? లేదా? అని కోట్లాది మంది సగటు వేతనజీవులు ఎదురు చూస్తారు.. ఈ మినహాయింపులు కోరుకునే వారికి ఆదాయపు పన్నే ఎత్తేస్తున్నారని తెలిస్తే, ఊహించని రీతిలో సానుకూల పవనాలు వీస్తాయన్నది మోదీ టీమ్ ఆలోచనట. వాస్తవానికి ఈ ప్రతిపాదన ఈనాటిది కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన వేళే వచ్చింది. నోట్ల రద్దుతో వ్యవస్థ బాగుపడుతుందని ప్రతిపాదించిన ‘అర్థగ్రంధి’ సంస్థ అదే సమయంలోనే ఆదాయపు పన్నుల రద్దు అంశాన్నీ ప్రతిపాదించింది. నగదు రహిత సమాజం విస్తరిస్తే, ఇన్ కం టాక్స్ వసూలు అవసరం లేదని పేర్కొంది. ఈఆదాయపు పన్ను రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకుంటే, ఆయన తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.