ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గం పొగాకు పంటకు ప్రసిద్ధి చెందింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కొండేపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షలా 10 వేల వరకు ఓట్లు ఉండగా, అందులో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 70 వేల వరకు ఉన్నారు. దాంతో అధికారులు కొండేపిని ఎస్సీ రిజర్వ్డ్ నియోజవర్గంగా గుర్తించారు. కమ్మ సామాజికవర్గ ఓట్లు 30 వేలు వరకు ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 23 వేల వరకు ఉన్నాయి. బీసీలు, ఇతర కులాలకు చెందిన వారి ఓట్లు 76 వేల వరకు ఉన్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జూపూడి ప్రకభాకర్పైన 5,440 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో డీబీ వీరాంజనేయ స్వామి ఆకాశమే హద్దుగా స్థానికంగా అనేక హామీలను గుప్పించారు. తాగునీటి సమస్యను తక్షణమే తీరుస్తానని ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేస్తానని టంగుటూరు రైల్వే గేటు వద్ద వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని, సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఇలా అనేక హామీలు ఇచ్చారు. మరి వాటి అమలుపైన ఎమ్మెల్యే ఎలా స్పందించారు. నియోజకవర్గంలో మార్పు కనిపించిందా..? అని ప్రజలను అడిగితే వారు పెదవి విరుస్తున్నారు. ఏ పథకం తీసుకున్నా.. అవి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే అందిస్తున్నారని విమర్శలు ఆయనపై ఉన్నాయి.
మాజీ మంత్రి, దివంగత నేత దామచర్లవర్గానికి చెందిన ఓ వర్గం చేతిలో ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు కీలు బొమ్మగా మారారని, దామచర్ల కుటుంబ సభ్యులు చెప్పినట్లే నడుచుకుంటున్నారని తనకంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే డీబీ వీరాంజనేయస్వామిని బహిరంగంగా విమర్శిస్తున్నారు.
జరుగుమల్లి మండలంలో ఉన్న ఇసుక రీచ్‌లను ఎమ్మెల్యే తన అనుచరుల సాయంతో గుప్పిట్లో పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక టంగుటూరు మండలం పరిధిలోగల పలు పంచాయతీల్లో పన్ను వసూళ్లలలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవన్నీ ఎమ్మెల్యే అండదండలతోనే జరిగాయని ఆరోపణలూ ఉన్నాయి. టంగుటూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జీ నిర్మిస్తానని హామీ ఇచ్చిన డోలా ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక పక్కా గృహాల మంజూరులోనూ తీవ్రమైన పక్షపాత ధోరణితో వ్యవహరించారని, బిల్లులు రాక పలువురు లబ్ధిదారులు విలవిలలాడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
టీడీపీకి చెందిన వారు ఎలాంటి నేరాలు చేసినా సరే.. నేరాలు చేసిన వారిపైన కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడం ఎమ్మెల్యే డీబీ వీరాంజనేయస్వామి ప్రత్యేకత. దీంతో ఎమ్మెల్యే అండదండలు చూసుకుని నిందితులు జల్సాగా తిరిగేస్తున్నారు. బాధితులు బాధతో రగిలిపోతూ.. ఇళ్లకే పరిమితమవుతున్నారు.
కొండపి నియోజకవర్గంలో తాగునీటి సమస్య అత్యంత దారుణంగా ఉంది. రామతీర్థం రిజర్వాయర్ నీరు ఇదే నియోజకవర్గం నుంచి కందుకూరు నియోజకవర్గానికి వెళుతున్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం తాగునీటి సమస్యల ఇంకా అలానే ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించే విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మర్రిపూడి మండలంలో ఫ్లోరిన్ సమస్య అధికంగా ఉంది. ఫ్లోరిన్ నీటిని తాగిన వారిలో చాలా మంది కిడ్నీ వ్యాధిభారిన పడుతున్నారు. కొండపిలోని 30 పడకల ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా మారుస్తానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. 12 కి.మీ మేర పొడవుగల సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఇరగదీస్తానని, సింగరాయకొండలో పారిశ్రామిక అభివృద్ధి తనతోనే సాధ్యమని, ఇలా ఇచ్చిన అనేక హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. కొండపిలో ఒక చిన్న రోడ్డును కూడా సరిగా వేయలేని తమ ఎమ్మెల్యే ఉండటం బాధాకరంగా ఉందని స్థానికులు అంటున్నారు. టీడీపీ నేతలు, నాయకులు కాకుండా ఇతరులు ఈ ప్రాంతంలో కాంట్రాక్టు పనులు చేసే అవకాశం లేదని మరుగుదొడ్డి నిర్మాణం నుంచి నీరు – చెట్టు వరకు ఇలా ప్రతీ ప్రభుత్వం పనిలోనూ అవినీతి కంపుకొడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కొండపి నియోజకవర్గంలో ప్రాధాన్యతగల ప్రాజెక్టు సంగమేశ్వర. నాలుగు కరువు మండలాలకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీన్ని మొదలుపెట్టారు. దాదాపు 9,500 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నాడు రాజశేఖర్‌రెడ్డి రూ.50వేల కోట్ల రూపాయల వరకు కేటాయించారు. అయితే, వైఎస్ఆర్ మరణం తరువాత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన డోలా బాలా వీరాంజనేయస్వామి ఇప్పుడు దాని మాటే ఎత్తడం లేదు. ఎంతో కాలంగా ఈ రిజర్వాయర్ కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు వైఎస్ జగన్‌తోనే తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల అరాచకాలకు అంతేలేకుండా పోతుంది. భూముల కబ్జాల్లో, బెల్టుషాపుల నిర్వహణలో టీడీపీ నేతలు, కార్యకర్తలు 24 గంటలూ నిమగ్నమై ఉన్నారని, రెండుచేతులా అక్రమార్జనలకు పాల్పడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్క పొన్నలూరు మండలంలోనే వేల ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదువుకున్న ఎమ్మెల్యే, వైద్య వృత్తిని వదిలేసి ప్రజాసేవలోకి వచ్చిన నాయకుడనుకుని ఎంతో కొంత మేలు చేస్తాడని ఓటు వేస్తే.. తమను తీవ్ర నిస్పృహలోకి నెట్టేశాడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దీంతో, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరనుందని తెలుస్తోంది.