నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో భారీ దోపిడీ సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. చైతన్య, నారాయణలు చంద్రబాబు బినామీ సంస్థలన్నారు.నారాయణలో ఇంటర్ ఏడాది ఫీజు రూ.1.60 లక్షలా అని ప్రశ్నించారు. విద్యార్థులంతా ఈ రెండు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఇందులో భాగంగానే రేషనలైజేషన్‌తో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆగస్టు వచ్చినా పిల్లలకు పుస్తకాలు లేవని, యూనిఫాం ఇవ్వలేదన్నారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల ప్రక్షాళన చేసి ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తామన్నారు. ఇవాళ పిల్లలను ఓ మాదిరి బడికి పంపించాలటే ఏడాదికి రూ.40 వేలు ఖర్చవుతోంది. ఈ ఫీజుకు అదనంగా ఏటా ఈ స్కూళ్లు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెంచుకునేందుకు ఈ పెద్దమనిషి (చంద్రబాబు) దగ్గరుండి వెసులుబాటు కల్పిస్తున్నాడన్నారు. ఇంటర్మీడియట్‌కు ఏడాదికి రూ.65 వేలు వసూలు చేస్తుండడం దారుణమన్నారు. నారాయణ కాలేజీల్లో ఏడాది ఫీజు అక్షరాలా రూ.1.60 లక్షలని, హాస్టల్ ఫీజులతో కలిపి సంవత్సరానికి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్ధులకు అన్నగా అండగా ఉంటానని, పిల్లలను బడికి పంపితే ఆ తల్లుల అకౌంట్లలో డబ్బులు వేస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు.
