వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోసపూరిత పాలనతో విసుగుచెందిన పలువురు నేతలు వైఎస్ఆర్‌సీపీలో చేరుతున్నారు.
కాగా, జగన్ పాదయాత్ర ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి క్రాస్‌రోడ్డు నుంచి 230వ రోజు ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసాను కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నాలుగేళ్ల నుంచి టీడీపీ పాలనలో పడుతున్న కష్టాలను ప్రజలు జగన్‌తో చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, టాలీవుడ్‌లో ఒక పక్క హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూనే.. మరో పక్క తనదైన శైలిలో ప్రాధాన్యతగల పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నకృష్ణుడు ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, మళ్లీ అలాంటి రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆశించారు. జగన్‌కు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరినట్టు కృష్ణుడు తెలిపారు.