2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో అలకలు, పోకలు, చేరికలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తు అంటూ వివిధ పార్టీల బలా బలాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కథనాలు వెల్లువలా ప్రచురితమైన విషయం తెలిసిందే. మరో పక్క రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు మరింత హీటు పెంచేలా ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇటీవల ఏపీలో చేసిన సర్వేను విడుదల చేసింది. ఇప్పుడు ఆ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, జాతీయ మీడియా ఛానెల్ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీతోపాటు.. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీల వ్యవహార శైలిని, ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై ప్రజల్లో ప్రస్తుతం ఉన్న అభిప్రాయాలేంటి..? అలాగే, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారు..? అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మరీ జాతీయ మీడియా ఛానెల్ సర్వే.. ఓ నివేదికను రూపొందించింది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.
ఓ జాతీయ మీడియా చేసిన ఈ సర్వేలో టీడీపీ ఓటు బ్యాంకు 40 శాతం తగ్గిపోయింది. దీనికి గల కారణాలను కూడా సర్వే సంస్థ వెల్లడిచింది. చంద్రబాబు సర్కార్ విధానాలు, కుల రాజకీయమేనని జాతీయ మీడియా ఛానెల్ వెల్లడించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, అలాగే, రైతు రుణమాఫీ 84 వేల కోట్లు ఉంటే.. ఇప్పటి వరకు 11వేల కోట్లను మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారని చెప్పుకొచ్చింది.
చంద్రబాబు హయాంలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం బాగా పెరిగిందని సర్వే పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇది చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేక పవనాలు వీచేలా చేసింది.
మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజాభిప్రాయాన్ని సర్వే సిబ్బంది సేకరించారు. ఆ సర్వేల్లో ఏపీ ప్రజలు చంద్రబాబు పాలనపై విముఖత చూపుతున్నట్లు తేలింది. నూటికి 80 శాతం మంది ప్రజలు రాజధాని నిర్మాణం, ఇంటికో ఉద్యోగం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం ఏపీకి ఉపయోగపడలేదని ప్రజలు తేల్చి చెప్పారు.
అంతేకాకుండా, 2014 ఎన్నికల్లో 600 హామీల మోసపూరిత వాగ్ధానాలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బు మూటలు చూపి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కోట్లు చూపి ఓటును కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఇలా చంద్రబాబుపై రోజులు గడిచేకొద్దీ కేసులు పెరుగుతున్నాయే తప్ప, తగ్గడం లేదని, ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయితే.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఇప్పటికే పలు పత్రికలు ప్రచురించిన విషయాన్ని జాతీయ మీడియా పేర్కొంది.
వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ 140 ఎమ్మెల్యే, 20 – 22 ఎంపీ సీట్లతో ఏపీలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, టీడీపీ 20 నుంచి 25 ఎమ్మెల్యే సీట్లు, ఇతరులు 5 నుంచి 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలరని సర్వే తేల్చి చెప్పింది.