ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో మరో భారీ అవినీతి కుంభకోణం వచ్చి చేరింది. ఇంత వరకు రాజధాని అమరావతి భూ కుంభకోణం, నీరు – చెట్టు, ఇసుక, మద్యం మాఫియా, గృహ నిర్మాణం, పోలవరం, నీటి పారుదల ప్రాజెక్టుల్లో వెలుగు చూసిన అవినీతిని తలదన్నేలా మరో భారీ కుంభకోణం బయటపడింది. పర్సనల్ డిపాజిట్ల పేరుతో రూ.53వేల కోట్లను కొల్లగొట్టారని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక బయటపెట్టింది. దీన్ని పసిగట్టిన కాగ్ చంద్రబాబు సర్కార్‌ను వివరణ కోరగా సమాధానం ఇవ్వకపోవడంతో స్కాంపై అనుమానాలు మొదలయ్యాయి.
ప్రజా అవసరాల కోసం అనేక ప్రభుత్వరంగ సంస్థలు వివిధ డిపార్ట్‌మెంట్ల వద్ద వేలాది రూపాయలు వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లలో ఉంటాయి. వీటిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, వాటర్‌సప్లై, సివిల్ సప్లై, హౌసింగ్ వంటి కార్పొరేషన్, స్థానిక సంస్థల అత్యవసర ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం లేదా.. కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. వీటిని ఖర్చు చేసేందుకు అధికారుల పేరిట కొన్ని పర్సనల్ డిపాజిట్స్ అకౌంట్స్ తెరుస్తారు. ఇలా నిధులు ఖర్చు చేసేందుకు ఏ రాష్ట్రంలోనైనా వందల సంఖ్యలో ఖాతాలు ఉంటాయి. సాధారణంగా ట్రెజరీ ద్వారా జరిగే ఖర్చులపై అధికారుల తనిఖీ ఉంటుంది. కానీ, పర్సనల్ అకౌంట్స్ ద్వారా జరిగే ఖర్చులకు ఎలాంటి నియంత్రణ ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నాయకులు, అధికారులు ఇష్టానుసారంగా పర్సనల్ అకౌంట్స్‌లోని నిధులను చెక్కుల రూపంలో మింగేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అవసరం ఉన్నా.. లేకున్నా.. లేని ఖర్చులను ఉన్నట్లు అదనంగా చూపించి కోట్ల రూపాయలను తమ జేబులో వేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో వందలు.. వేలల్లో అకౌంట్స్ ఖాతాలు ఉండగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే 58,539 పర్సనల్ ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాల ద్వారా రూ.53వేల కోట్లను దారి మళ్లించారని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.