తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మంత్రి కేటీ రామారావు కి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. ఈ మేరకు ఆదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జహెడ్ అల్ నాహ్యన్ మంత్రి కేటీ రామారావు ని కోరారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని అరబ్ ఎమిరేట్స్ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి తీసుకొచ్చిన పలు కీలకమైన అంశాల్లో తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. దీంతోపాటు తెలంగాణతో విద్య మరియు వ్యాపార వాణిజ్య రంగాల్లో ఇరుప్రాంతాల మధ్య మరింత బలమైన సంబంధాల దిశగా చర్చించేందుకు తమ దేశంలో పర్యటించాల్సిందిగా మంత్రికి రాసిన లేఖలో ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాపార వాణిజ్యాల తోపాటు గల్ఫ్ కార్మికుల అంశాలను కూడా యూఏఈ మంత్రి దృష్టికి తీసుకెళ్లిందనీ మంత్రి కేటియర్ తెలిపారు. యూఏఈ ఆహ్వానం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.