కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. 10 మంది గల్లంతయ్యారని సమాచారం. గాయపడిన వారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులంతా ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ క్వారీని తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్ చౌదరి, అతడి సోదరుడు సువాస్ చౌదరి నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. భారీ పేలుడు ధాటికి మృతుల శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఏ శరీర భాగం ఎవరిదో గుర్తు పట్టలేనంతగా మారాయి. గాయపడిన వారు అపస్మారకస్థితిలో వెళ్లారు. షాక్కు గురై ఏమీ చెప్పలేకపోతున్నారు. పైగా వారి భాష కూడా ఇక్కడెవరికీ అర్థం కావడం లేదు. దీంతో పేలుడు ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. క్షతగాత్రులను ఆలూరు, కర్నూలు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పేలుడు తీవ్రతకు మూడు ట్రాక్టర్లు, ఒక లారీ మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.
