Home / Uncategorized / ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు కలిశారంటే..?

ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు కలిశారంటే..?

బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు. తెలంగాణ స్థానిక యువకులకు ఉద్యోగవకాశాల్లో ప్రాధాన్యం లభించేందుకు ఏర్పాటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని, హైకోర్టును తక్షణం విభజించాలని కోరారు. ఈ రెండు జరగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని ప్రధానికి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన 11 అంశాలు చర్చించారు.

1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే, తెలంగాణలో బలహీన వర్గాల జనాభా అధికంగా ఉందని, దాని ప్రకారం తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానికి సిఎం చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీలు 7.11 శాతం ఉంటే, తెలంగాణలో 9.08శాతం ఉన్నారని, ఉమ్మడి రాష్ట్రంలో 9.56 శాతం ముస్లింలుంటే, తెలంగాణలో 12.68 ఉన్నారని, బిసిలు 50 శాతానికి పైగా ఉన్నారని సిఎం వివరించారు. కాబట్టి బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బిసి ఇ గ్రూపులోని కులాలకు రిజర్వేషన్లు 4నుంచి 12 శాతానికి పెంచాలని బిసి కమిషన్ చేసిన సిఫారసు విషయాన్ని కూడా సిఎం ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని,కానీ అదే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పెంచుకోవడానికి తగిన కారణాలు కూడా చెప్పాలని కోరిందని సిఎం చెప్పారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని కూడా సిఎం గుర్తు చేశారు. తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న బలహీన వర్గాలను దృష్టిలో పెంచుకుని రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ‘తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్అండ్ షెడ్యూల్డ్ ట్రైడ్స్ (రిజర్వేషన్ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్) బిల్లు 2017ను ఆమోదించిన విషయాన్ని కూడా ప్రధానికి వివరించారు. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందని, ఈ విషయంలో చొరవ చూపి, తెలంగాణలో పెంచిన రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ప్రధానిని సిఎం కోరారు.

2. తెలంగాణ రాష్ట్రంలో జరిపే ఉద్యోగ నియామకాల్లో స్థానిక యువకులకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశ్యంతో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేయాలని ప్రధాని మోడీని సిఎం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, జిల్లా కేడర్ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ కేటాయించామని వెల్లడించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్ జోన్లు ఏర్పాటు చేసుకున్నామని, వీటిని ఆమోదించాలని సిఎం కోరారు.

3. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు విభజన జరగనిదే రాష్ట్ర విభజన ప్రక్రియ పరిపూర్ణం కాదని సిఎం స్పష్టం చేశారు. హైకోర్టును విభజించి, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే హైకోర్టు విభజన పూర్తి చేయాలని కోరారు.

4. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరిత గతిన అనుమతులు ఇచ్చినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి, రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాలని ప్రధానిని కోరారు.

5. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు త్వరిత గతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సిఎం వివరించారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. అక్కన్నపేట్-మెదక్ రైల్వే లైను నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయిందని, ఈ లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. భద్రాచలం రోడ్-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

6. కాజీపేట- విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం-మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలని మనవి చేశారు. సికింద్రాబాద్-మహబూబ్ నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వే లైన్లను ను డబుల్ లేన్ గా మార్చడానికి, హుజురాబాద్ మీదుగా కాజీపేట-కరీంనగర్ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించాలన్నారు.

7. హైదరాబాద్ లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని కోరారు. 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు స్టేట్ హైవే విస్తరించడానికి అనుగుణంగా రక్షణ శాఖ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని గుర్తుచేశారు. ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుందన్నారు. ఈ మూడు ప్రాంతాల్లోని రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా కోరారు.

8. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాల్సి ఉండగా2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదన్నారు. ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయగలరని మనవి చేశారు.

9. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం 2013 సంవత్సరంలో హైదరాబాద్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజన్ (ఐటిఐఆర్) మంజూరు చేసిందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ కూడా సమర్పించిందని, కానీ హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల్లో చదివామన్నారు. ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని, కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు.

10. కరీంనగర్ పట్టణంలో ఐఐఐటి స్థాపించాలని కోరారు. దీనికి సంబంధించి స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయి. వరంగల్ లో నిట్ ఉంది. కరీంనగర్ నగరంలో ఐఐఐటి స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింత బాగా విస్తరించినట్లవుతుందని ప్రధానికి వివరించారు.

11. ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకున్నదని, దాని ప్రకారం తెలంగాణలో ప్రతీజిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం నవోదయ విద్యాలయాలున్నాయన్నారు. మిగతా జిల్లాలయిన ఆదిలాబాద్, నిర్మల్,, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్,భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పాలన్నారు. ఈ విద్యాలయాలకు కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి చెప్పారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat