ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ పార్టీ నుండే కాక అన్ని పార్టీలు నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అత్యధికంగా టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి గ్రామానికి చెందిన టీడీపీ
నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. దీంతో గ్రామంలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలింది. గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య జిల్లా కార్యదర్శి కందా సుబ్రహ్మణ్యం (నాగబాబు) ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. నాగబాబు ఆధ్వర్యంలో సుమారు 200 మంది టీడీపీని వీడి, వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కందా సత్యనారాయణ, బెల్లంకొండ అప్పారావు, కందా రాములు, ప్రకాశరావు, రామన్నదొర, వెంకట్రావు, సూర్యనారాయణ, రాములు, అప్పలరాజు తదితరులు ఉన్నారు. టీడీపీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని నాగబాబు తెలిపారు. వైసీపీతోనే కాపులకు న్యాయం జరుగుతుందన్నారు. కాపులకు రూ10వేల కోట్లు
ప్రకటించడం హర్షించదగిన విషయమన్నారు. స్థానిక పార్టీ నాయకులు కందా చినబాబు, కందా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.టీడీపీకి కంచుకోటగా ఉన్న వన్నెపూడి గ్రామంలో ఇప్పుడు ఆ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు పార్టీని వీడడం కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. పార్టీలోని అంతర్గత విభేదాలు, ఏళ్ల తరబడి ఒకే కుటుంబం అధికారం చెలాయించడంపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు.
