ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తో పాటు పలువురు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జగన్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వైఎస్ జగన్ తోనే సాధ్యమవుతుందని పలువురు నాయకులు అన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా అవినీతి మయంగా మారిందన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు దొరికినకాడికి దోచుకోవడానికే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని విజయపథంలో నడిపించడంతో పాటు జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తామన్నారు.