ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికే అంతంతమత్రంగా ఉంది.. రాష్ట్ర విభజనతో 2014నుంచిజరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జనాదరణకోల్పోయింది. అయితే మళ్లీ కాంగ్రెస్ కు జవసత్వాలు అందించాలని… ఆపార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రయత్నిస్తున్నారట.. ఈ క్రమంలో పార్టీలోని గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయట..దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలంనుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు, ఇటీవలే తిరిగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎంనల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తోందట.. ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, పార్టీని బలోపేతం చేసే విషయంలో కాకుండా ఒకరు జగన్ కు మరొకరు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతుండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తోంది.
మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కేవీపీ తన స్నేహితుడి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని గతంలో ఓసారి వదులుకున్నాం కనుక ఇప్పుడు ఆయనకు ఎలాగో అండగా ఉండలేము కానీ టీడీపీకి సపోర్ట్ ఇవ్వొద్దని చెప్తుంటే ఈ మాజీ ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రికి మద్దతివ్వాలంటున్నారట.. జగన్ బలహీనమైతే కాంగ్రెస్ పుంజుకుంటుందని వాదిస్తున్నారట. జగన్ ని బలహీనపరిస్తే చంద్రబాబు పుంజుకుంటారని చంద్రబాబుకంటే జగన్ కే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతివ్వాలని కేవీపీ వాదిస్తున్నారట. ఇప్పటికే కొందరు నేతలను వైసీపీలో చేర్చడంలో కేవీపీ క్రియాశీలకంగా వ్యవహరించారట.. అవసరమైతే త్వరలోనే కేవీపీ జగన్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాగే ఓసారి తనకు జగన్ ముఖ్యమని, ఆయన శ్రేయస్సు కోసం పని చేస్తానని కేవీపీ చెప్పడంతో.. కాంగ్రెస్‌లో ఉండి ఇటువంటి పనులు చేసే బదులు వైసీపీలో చేరాలని నల్లారి గొణిగినట్టు వార్తలొచ్చాయి. మొత్తమ్మీద చాలాకాలానికి వైఎస్ ఆత్మ జగన్ ను ఆవహించనుందని స్పష్టమవుతోంది.