నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మిషన్ భగీరథ పథకం అమలుపై శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు మరియు అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరధ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన, స్వచ్చమైన త్రాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా త్వరితంగా మిషన్ భగీరధ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరును అందించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే పనులు వేగవంతంగా జరుగుతాయి. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలతో వేగంగా పనిచేయించుకోవాలన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1645 నివాస ప్రాంతాలకు మిషన్ భగీరధ పథకం ద్వారా త్రాగునీరు అందుతుంది. సింగూరు సెగ్మెంట్, శ్రీరాంసాగర్ సెగ్మెంట్ ల ద్వారా త్రాగునీరందుతుంది. మెయిన్ పైప్ లైన్ నిర్మాణం పూర్తయి గ్రామాలకు బల్క్ వాటర్ చేరుకుంటుందన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గాల వారిగా నిర్మాణ పనుల తీరును మంత్రి సమీక్షించారు. ఇప్పటికే మెజారిటి గ్రామాలకు బల్క్ వాటర్ చేరుకుందని, కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలుపగా, ఎట్టి పరిస్థితులలోను అగస్టు 15 నాటికి అన్ని గ్రామాలకు బల్క్ వాటర్ చేరుకోవాలని ఆదేశించారు. గ్రామాలకు బల్క్ వాటర్ చేరుకుంటే ప్రస్తుతం ఉన్న ఉపరితల నీటి నిల్వ ట్యాంకులు, గ్రామాలలోని అంతర్గత నీటి సరఫరా వ్యవస్థ ద్వారా తక్షణమే త్రాగునీరు అందించవచ్చన్నారు.
అగస్టు 15 నాటికి పనులు పూర్తి చెసే విదంగా అధికారులు ప్రణాళికలను రూపొందించుకోవాలి. అవరమైతే అధికారులు 24 గంటలు నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ వర్కింగ్ ఏజెన్సీల వెంటపడి పనులను చేయించాలి. అవసరమైన మిషనరీని, లేబర్ ని సమకూర్చుకోని రాత్రింబవళ్ళు పనిచేసి అగస్టు 14 రాత్రికల్లా ప్రతి గ్రామానికి మిషన్ భగీరధ నీరు చేర్చాలని వర్కింగ్ ఏజెన్సీలకు మంత్రి సూచించారు. ప్రతి గ్రామానికి నీరు చేర్చడమే కాదు ప్రతి ఇంటికి నీరు చేరి ప్రజలు తాగినప్పుడే మిషన్ భగీరధ పథకం ఫలాలు అందినట్లని మంత్రి తెలిపారు. గ్రామాలలో ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన ఇంట్రా విలేజి నెట్ వర్క్ పైన కూడా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం మందకొడిగా సాగుతుండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిదంగా ఇంట్రావిలేజికి, ఇంటింటికి నల్లాలను బిగించడానికి అవసరమైన ట్యాప్, ఇతర మెటిరియల్ ను త్వరితంగా అందించాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకుంటూ అగస్టు 15 నాటికి ప్రతి గ్రామానికి మిషన్ భగీరధ జలాలు చేరుకోవాలని మంత్రి ఆదేశించారు.