అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. విజయనగరం వంశ రాజుల వారసురాలిగా అదితి 2019 బరిలో ఉంటారని సమాచారం.. అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన ఈమె కొంతకాలంగా పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. కార్యకర్తలను కలుస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రాజవంశస్తులు మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. అశోక్‌గజపతిరాజు ఇప్పటివరకూ 1983నుంచి 2009వరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు.
ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల్లో తనతోపాటు తన కుమార్తె అదితిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారట. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని, ఆయనతో ఈ విషయంపై చర్చించలేదని, చర్చించిన తరువాత.. చంద్రబాబు స్పందనను బట్టి అశోక్ ఏమి చేస్తారో వేచి చూడాలి. అదితిని మాత్రం విజయనగరం జిల్లాలో అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలనే స్పష్టతతో ఉన్నారట.. చంద్రబాబు గనుక ఒప్పుకోకపోతే పార్టీ మారినా ఆశ్చర్యం లేదని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. కారణం ఇప్పుడు ఉత్తరాంద్రలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తుంది. దీనిలో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం, అలాగే అశోకగజపతి రాజు వర్గంగా టీడీపీ నాయకులు విడిపోయినట్లు సమాచారం. ఈరెండు వర్గాలు ఎవరి స్థాయిలో వారు ఉత్తరాంద్ర మీద ఆధిపత్యం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.. అలాగే టంటాతోపాటు వైసీపీనుంచి టీడీపీలో చేరిన సంజయ్ కృష్ణరంగారావు మరో వర్గంగా ఉంటూ అశోకగజపతి ప్రాభల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆధిపత్య పోరుతో క్రింది స్థాయిలో టీడీపీలో అసమ్మతి వర్గం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అశోక్ గజపతిరాజు అనుచరులు. ఆయన కుటుంబ మద్దతుదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా స్థానిక పరిస్థితుల దృష్ట్యా వైసీపీలోకి మారాలని ఒత్తిడి తెస్తున్నారట.. చంద్రబాబు ఈ వర్గపోరును పరిష్కరించేందుకు ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం.. దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని జిల్లా నాయకులు చెబుతున్నారు. మొత్తంగా తొలిసారి పూసపాటి రాజవంశం నుంచి ఓ మహిళ ఎన్నికల బరిలోకి దిగుతుండడం, అదికూడా అధికార పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లే అవకాశాలు కనిపించడం కచ్చితంగా ఓ సంచలనంగా మారనుందని తెలుస్తోంది.