ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోసపూరిత పాలనతో విసుగుచెందిన పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. 226వ రోజు పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని విష్కరించిన వైఎస్ జగన్ గొల్లప్రోలు మీదుగా తాటిపర్తి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతోంది. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసాను కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నాలుగేళ్ల నుంచి టీడీపీ పాలనలో పడుతున్న కష్టాలను జగన్తో చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబు పాలనలో మోసపూరిత హామీలతో విసిగిపోయిన పలువురు నేతలు ఇవాళ వైసీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జి, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్ రామకృష్ణతోపాటు ఆరుగురు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి వైసీపీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి సత్య నారాయణ కూడా వైఎస్ఆర్సీపలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, మళ్లీ అలాంటి రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆశించారు. జగన్కు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరినట్టు వారు తెలిపారు.