ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ బండారం.. ఆధారాలతో సహా బయట పడింది. అవును, కార్పొరేట్ విద్యా సంస్థల్లో.. ప్రధాన విద్యా సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లు, కళాశాలలు ఫీజుల పేరుతో పేద ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్నారు. ఏపీలో జన్మభూమి కమిటీ మాఫియా లాగా.. మంత్రి నారాయణ విద్యా మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై గత నెల 12వ తేదీన ఆంధ్రజ్యోతి పేపర్‌లో కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి అంటూ నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు.
కాగా, మంగళవారం నాడు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని మీడియాకు వివరిస్తూ.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంసెట్ పేపర్ లీకేజ్‌కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఏపీలో ప్రధాన కార్పొరేట్ కళాశాలలు నారాయణ, శ్రీ చైతన్య, చైనా (శ్రీ చైతన్య, నారాయణ) కళాశాలలు పరీక్ష పేపర్లను కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు తేల్చేశారన్నారు. ఈ వ్యవహారం అంతా గత పది సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ కాలంలోనే దాదాపు 300 ర్యాంకుల్లో మొదట తమ వారే ఉండేలా మంత్రి నారాయణతోపాటు, శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం పరీక్ష పేపర్లను కొనుగోలు చేసిందన్నారు. ఇలా ప్రతీ సంవత్సరం పేద ప్రజల నుంచి నారాయణ విద్యా సంస్థలు కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ కళాశాలల్లో రూ.3వేలు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని మంత్రి నారాయణ వియ్యంకుడు.. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జీవో విడుదల చేశారని, కానీ, ఆ ఆదేశాలను తుంగలో తొక్కి మంత్రి నారాయణ లక్షల.. లక్షల ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.