కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది..? వైసీపీ నేతలతో ఎందుకు టచ్‌లోకి వచ్చారు. అధిష్టానం బుజ్జగింపులు వర్కవుట్ అయినట్టేనా..? చంద్రబాబు బుజ్జగింపులతో దారికొస్తారా..? అధికార పార్టీలో ఆయనకు వచ్చిన నష్టమేంటి..? ప‌్రస్తుతం తాను ఉన్న మూడు పదవులకు మేడా మల్లికార్జున రెడ్డి రాజీనామా చేస్తారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.
మేడా మల్లికార్జున రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యే, పైగా ప్రభుత్వ విప్, అంతేకాకుండా టీటీడీ బోర్డు సభ్యుడు కూడాను. ఇన్ని పదువులు ఉన్నా ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అన అనుచరులతో సమావేశమై తన పనిని సైలెంట్‌గా కానిచేస్తున్నారు. తనతోపాటు తన సోదరులు విజయ శేఖర్‌రెడ్డిని కూడా వైసీపీలో చేర్చేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలో మేడా మల్లికార్జునరెడ్డి అసలు ఎందుకు అలిగారు అన్న విషయంపై ఆరా తీసిన అధిష్టానానికి అసలు విషయం తెలిసింది. మేడా అలకలకు రకరకాల కారణాలుంటే.. అందులో ప్రధాన కారణం కొండమీద కొట్లాటనే అని తేలినట్టుగా సమాచారం. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మేడా మల్లికార్జునరెడ్డి ఇద్దరూ కడప జిల్లాకు చెందిన వ్యక్తులే. వేర్వేరు నియోజకవర్గాలకు చెందిన వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో తిరుమల కొండమీద జరిగిన ఓ వ్యవహారమే మేడా అలకకు ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోందట. అయితే, తిరుమల కొండపై ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి. ఈ మధ్య కొండమీద జరుగుతున్న వివిధ పనులను పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవలే పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగానే మేడా శేఖర్‌రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించిన పుట్టా.. పనుల్లో ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. సంబంధిత అధికారులతో నోటీసులు జారీ చేయించారట. సొంతపార్టీకి సంబంధించిన వ్యక్తి తన సోదరుడు కాంట్రాక్టుకు సంబంధించిన అంశంపై నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని మేడా మల్లికార్జున రెడ్డి వాదనగా వినిపిస్తోంది.
తానెప్పుడు కూడా పార్టీకిగానీ, పుట్టా సుధాకర్‌కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదని, కానీ, పుట్టా సుధాకర్ యాదవ్ పనిగట్టుకుని మరీ ఈ విధంగా నోటీసులు ఇప్పించడం మేడా ప్రశ్నిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సొంత పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల జరిగే పరిణామాలే కదా..! అన్న భావన మేడాలో ఉన్నట్టు సమాచారం. దీంతో మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.