10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10,429 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడి, కొత్త రికార్డు నమోదైంది. గరిష్ట డిమాండ్ నమోదైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత విధించకుండా సమర్థవంతంగా సరఫరా చేయగలిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అభినందించారు.
విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభాకర్ రావు అనుభవం తెలంగాణలో విద్యుత్ విజయాలకు అక్కరకొచ్చిందని సీఎం ప్రశంసించారు. జెన్ కో, ట్రాన్స్ కో ఒకరే అధిపతిగా ఉంటే, సమన్వయం బాగుండి విద్యుత్ సంస్థలు బాగుపడతాయని, విద్యుత్ సరఫరా మెరుగవుతుందని తాను నమ్మానని, నేడు అదే నిజమైందని సీఎం చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో చిమ్మచీకట్లు తప్పవనే జోస్యాలను అబద్ధమని తేల్చి, నేడు అన్ని రంగాలకు 24 గంటల సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలవడం అందరికీ గర్వకారణమన్నారు. సిఎండి ప్రభాకర్ రావుతో పాటు ఈ విజయానికి కారణమైన విద్యుత్ సంస్థల అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. పదివేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ దాటడం తెలంగాణ ప్రగతికి సూచిక అని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో విద్యుత్ తలసరి వినియోగం జాతీయ సగటుకన్నా 33 శాతం అధికంగా ఉండడం కూడా ప్రగతి సూచిక అని చెప్పారు.
తెలంగాణలో నాణ్యమైన కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉండడం, భవిష్యత్తులోనూ కరెంటుకు ఢోకా లేదనే పరిస్థితి ఏర్పడడం వల్ల పరిశ్రమలు తరలివస్తున్నాయని, ఐటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయని, ఇదంతా అంతిమంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయంలో దిగుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలకు కావల్సిన విద్యుత్ ను సరఫరా చేయడానికి గడువుకన్నా ముందే ఏర్పాట్లు పూర్తి చేశారని సీఎం అభినందించారు.
ముఖ్యమంత్రికి సిఎండి ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు:
—————————————————————–
సీఎం కేసీఆర్ మార్గదర్శకం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయని చెప్పారు. ఖరీఫ్ లో 11,500 గరిష్ట డిమాండ్ ఏర్పడుతుందనే అంచనా ఉందని, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.