ఏపీలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నారు ప్రజలు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులు మోహరించారు. జుమ్మామసీద్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ, ప్రజాసంఘాలు, ముస్లీం మైనారిటీలను అరెస్ట్ చేశారు.
బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థలాన్ని అక్రమంగా తక్కువ ధరకు కట్టబెట్టడం..ముస్లిం సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో జుమ్మా మసీద్ స్థలం లీజుపై వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ వెనక్కు తగ్గారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో జలీల్ ఖాన్ హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జుమ్మామసీద్ స్థలం లీజు టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.